వెస్ట్ బెంగాల్‌లో రూ.30 కోట్ల విలువ చేసే పాము విషం స్వాధీనం

సోమవారం, 17 అక్టోబరు 2022 (08:41 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో రూ.30 కోట్ల విలువైన పాము విషంను స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి చైనా మీదుగా భారత్‌లోకి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. గత 35 రోజుల్లో రెండోసారి పట్టుబడింది. 
 
పాము విషాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఫన్సిడేవా ప్రాంతంలో సోదాలు నిర్వహించిన అటవీ అధికారులు శనివారం రాత్రి రెండున్నర కేజీల పాము విషాన్ని గుర్తించారు. ఓ క్రిస్టల్ జార్‌లో నింపి అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. 
 
నిందితుడిని ఉత్తర దినాజ్‌పూర్‌ జిల్లాకు చెందిన మహ్మద్ సరాఫత్‌గా గుర్తించారు. పాము విషాన్ని చైనాకు తరలిస్తున్నట్టు విచారణలో అతడు పేర్కొన్నాడు. విషం బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి వచ్చిందని, ఇక్కడి నుంచి దానిని నేపాల్‌కు తరలించి అక్కడి నుంచి చైనాకు తీసుకెళ్లనున్నట్టు చెప్పాడు. 
 
అంతర్జాతీయ మార్కెట్లో పాము విషానికి విపరీతమైన డిమాండ్ ఉందని, పట్టుబడిన పాము విషం రూ.30 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, పశ్చిమ బెంగాల్‌లో పాము విషాన్ని స్వాధీనం చేసుకోవడం 35 రోజుల్లో ఇది రెండోసారి. సెప్టెంబరు 10వ తేదీన జల్పాయ్‌గురి జిల్లాలో రూ.13 కోట్ల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు