ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ తిరిగి మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది. భారతీయ జనతా పార్టీని చిత్తు చేసి అధికారంలోకి వచ్చింది. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్ రాష్ట్రంలో హింస చెలరేగింది. ఈ హింసపై తృణమూల్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.
ఈ పరిస్థితుల్లో బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం హింసాకాండ చెలరేగిందని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని, హింసాకాండపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఇండిక్ కలెక్టివ్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
అంతకుముందు, బెంగాల్ హింసాకాండపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని బీజేపీ నేత గౌరవ్ భాటియా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం సోమవారం తృణమూల్ కార్యకర్తలు తమ పార్టీనేతలపై దాడులకు పాల్పడ్డారని, మహిళలపై లైంగిక దాడులకు తెగబడ్డారని బీజేపీ ఆరోపించింది.
ప్రధాని నరేంద్ర మోడీ తనకు ఫోన్ చేశారని, బెంగాల్ హింసపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ చెప్పారు. అల్లర్లను మమత నియంత్రించాలని కాంగ్రెస్ కోరింది. కాగా పూర్వబర్ధమాన్ జిల్లాలో తృణమూల్ కార్యకర్త హత్యకు గురయ్యారని పోలీసులు తెలిపారు.