మద్యం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విడుదలకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్!!

వరుణ్

శుక్రవారం, 21 జూన్ 2024 (16:15 IST)
మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విడుదలకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. కేజ్రీవాల్‌కు కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై తాత్కాలిక స్టే విధించింది. ఈడీ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు బెయిల్‌ మంజూరు చేయకూడదని స్పష్టం చేసింది. దీంతో శుక్రవారం సాయంత్రం తమ అధినేత బయటకు వస్తారని సంబరాలకు ఏర్పాట్లు చేసుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలకు షాక్ తగిలినట్లైంది.
 
మరోవైపు, ఈడీ తీర్పు కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్‌ మండిపడ్డారు. ఢిల్లీలో నీటి సమస్యను పరిష్కరించాలని ఆమ్‌ఆద్మీ పార్టీ నేతలు శుక్రవారం భోగల్‌లో చేపట్టిన నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఇందులోభాగంగా సునీత మాట్లాడుతూ తన భర్త, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను ట్రయల్ కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకముందే ఈడీ ఎలా సవాలు చేస్తుందని ప్రశ్నించారు. దేశంలో నియంతృత్వం హద్దులు దాటిందని అసహనం వ్యక్తంచేశారు. సీఎం స్థాయిలో ఉన్న కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిలా చూస్తున్నారన్నారు. హైకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు