కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ పూర్తి.. రిజర్వులో తీర్పు!

ఠాగూర్

మంగళవారం, 28 మే 2024 (16:46 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ పూర్తయింది. కానీ, తీర్పును మాత్రం కోర్టు రిజర్వులో ఉంచింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వు చేశారు. బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మంగళవారం దర్యాప్తు సంస్థల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. రెండు వర్గాల వాదనలు పూర్తయిన తర్వాత ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. కాగా, మద్యం పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. 
 
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాక్ 
 
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‍‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పొడగింపు పిటిషన్‌పై తక్షణ విచారణను చేపట్టలేమని సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ పిటిషన్ గురించి గత వారం ప్రధాన బెంచ్ ముందు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించింది. ఈ కేసులో తీర్పు రిజర్వులో ఉన్నందున పిటిషన్ లిస్టింగ్‌పై తగు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ కేసులో జూన్ ఒకటో తేదీ వరకూ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెల్సిందే. జూన్ రెండో తేదీన ఆయన జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంటుంది. 
 
అయితే, వైద్య పరీక్షల నిమిత్తం బెయిల్ పిటిషన్‌ను మరో వారం రోజుల పాటు పొడగించాలంటూ కేజ్రీవాల్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన బరువు నెల రోజుల వ్యవధిలో అకారణంగా 7 కేజీల మేరకు తగ్గిపోయిందని అన్నారు. ఇది తీవ్ర అనారోగ్య సమస్యకు సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్ స్కాన్ సహా ఇతర వైద్య పరీక్షల కోసం ఏడు రోజుల సమయం పడుతుందని, ఇందుకు అనుగుణంగానే బెయిల్ పొడగించాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించినట్టు తెలిపారు. మే 10వ తేదీన ఆయన తీహార్ జైలు నుంచి విడుదలైన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు