హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బూటు దాడి జరిగింది. దక్షిణ ముంబైలో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒవైసీపై బూటు విసిరాడు. అయితే, అది ఆయనకు తగలకుండా, కొంచెం పక్కనుంచి వెళ్లిపోయింది. ఘటనతో ఏమాత్రం బెదరని ఒవైసీ... ఆ తర్వాత తన ప్రసంగాన్ని యథాతథంగా కొనసాగించారు. ఈ ఘటన రాత్రి 9.45 గంటల సమయంలో చోటు చేసుకుంది. ట్రిపుల్ తలాక్‌పై ఆయన ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది.
ట్రిపుల్ తలాక్‌ను సాధారణ ప్రజలు, ముఖ్యంగా ముస్లింలు అంగీకరించడం లేదనే విషయాన్ని అధికారపక్ష నేతలు గుర్తించడం లేదని ఈ సందర్భంగా ఒవైసీ మండిపడ్డారు. వీళ్లంతా అసహనంతో ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవడం కోసం అవసరమైతే ప్రాణాలను సైతం ఫణంగా పెడతానని చెప్పారు. మహాత్మాగాంధీ, నరేంద్ర దభోల్కర్, గోవిండ్ పన్సారేలను చంపిన హంతకుల భావజాలాన్నే తనపై బూటు దాడి చేసిన వారు కూడా అనుసరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.