13వ తేదీకి అటల్‌కి వున్న లింకేంటో తెలుసా..?

శుక్రవారం, 17 ఆగస్టు 2018 (11:17 IST)
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితంలో ఓ తేదీ పెనవేసుకుపోయింది. అది 13వ తేదీ. అవును. 13వ తేదీ... వాజ్‌పేయికి 13వ నెంబరుతో దగ్గర సంబంధం ఉందని సన్నిహితులు అంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. 1996 మే 16వ తేదీన మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఆయన పని చేసిన రోజులెన్నో తెలుసా 13.
 
1998లో రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ పదమూడు నెలలకే ప్రభుత్వం మైనారిటీలో పడింది. అంతేగాకుండా.. 1999 అక్టోబర్‌ నెలలో మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది 13వ తేదీనే. ఆయన హయాంలో పార్లమెంటుపై దాడి జరిగిందీ 13వ తేదీనే.
 
అందుకే ఈ 13వ తేదీ వాజ్‌పేయి జీవితంలో కొన్ని మంచి చేసినా.. కొన్ని ఘటనలు గగుర్పాటు గురిచేశాయి. అయినా వాజ్‌పేయి మాత్రం భయాన్ని పక్కనబెట్టి అజాతశత్రువుగా మారిపోయారు. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంతో ముందుకెళ్లారు. అటల్ జీ గొప్ప రాజనీతిజ్ఞుడు. మాటల మాంత్రికుడు. మాటలతోనే కాదు చేతలతోనూ చాతుర్యం చూపిన గొప్ప వ్యక్తి. 
 
అందుకే భారత ప్రధానిగా దేశ ప్రజలకు చిరకాలం గుర్తుండి పోయేలా మారారు. అణుపరీక్ష నిర్వహించిన మూడుమాసాల వ్యవధిలోనే పాకిస్థాన్‌కు బస్సు యాత్ర చేయడం ద్వారా పొరుగుదేశానికి స్నేహహస్తం చాటిన చతురుడు వాజ్ పేయి.
 
1999 అక్టోబర్ 13న మూడోసారి భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వాజ్ పేయి ఆ తర్వాత సాహసోపేతమైన, చారిత్రక అద్భుతాలు చేశారు. అగ్రరాజ్యం అమెరికా బెదిరింపులు, ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పాకిస్థాన్ సరిహద్దుల్లోని పోఖ్రాన్ లో 1998 మే 11న విజయవంతంగా అణుపరీక్ష నిర్వహించడంలో ప్రధానిగా వాజ్ పేయి మహాసాహసమే చేశారు. దాయాది పాకిస్థాన్ గుండెల్లో గుబులు రేపడంతో పాటు దుస్సాహాసానికి పాల్పడితే భారీమూల్యం చెల్లించుకోక తప్పదంటూ పరోక్షంగా హెచ్చరించారు.
 
పోఖ్రాన్ అణుపరీక్షతో రగిలిపోతున్న పాకిస్థాన్‌లోని లాహోర్ నగరానికి బస్సుయాత్రతో దౌత్యాన్ని నిర్వహించి స్నేహహస్తం సాచారు. భారత్‌కు దురాశకానీ దురాక్రమణకానీ చేసే ఉద్దేశం లేదంటూ ప్రపంచానికి చాటారు. పాకిస్థాన్ అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ తో చర్చలు జరపడం ద్వారా భారత్ మిత్రదేశమేకానీ శత్రుదేశం కానేకాదని చాటి చెప్పారు. ఆ తర్వాత మూడుమాసాలకే పాకిస్థాన్ నమ్మకద్రోహంతో కార్గిల్ యుద్ధానికి దిగడం భారత వీరజవానులు దీటైన సమాధానం చెప్పడం అందరికీ తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు