దొంగ బాబాలపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ప్రత్యేకించి బాబాలపై అత్యాచారాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. హరియాణాలో ఓ పూజారి 120 మంది మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టిన ఉదంతం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే హరియాణాలోని ఫతేహాబాద్‌లో గల తొహానా పట్టణంలో బాబా అమర్‌పురి అలియాస్ బిల్లు(60).. బాబా బాలక్‌నాథ్ ఆలయ ప్రధానపూజారి. వ్యక్తిగత సమస్యలు చెప్పుకుని ఉపశమనం పొందుదామనుకున్న మహిళలను మాటలతో మాయ చేసేవాడు.
తాంత్రిక పూజలు చేస్తే పరిష్కారమవుతాయని నమ్మించేవాడు. తీర్థప్రసాదాలలో మత్తుమందు కలిపేవాడు. మహిళలు స్పృహలో లేనప్పుడు వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఆ నీచాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించేవాడు. వాటిని చూపించి మళ్లీమళ్లీ లొంగదీసుకునేవాడు. ఇలా 120 మందిపై అఘాయిత్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అతడి దురాగతానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్‌లో హల్‌చల్ చేయడాన్ని బాబా సమీప బంధువు ఒకరు చూశారు. దాన్ని పోలీసులకు చూపించాడు.
రంగంలోకి దిగిన పోలీసులు బాబా ఇంటిని తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వస్తుసామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బాబాను అరెస్టు చేసి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, ఐదు రోజుల రిమాండు విధించింది. పోలీసులకు లంచం ఇవ్వలేదనే తనను అరెస్టు చేశారని బాబా ఆరోపిస్తున్నాడు. మరోవైపు బాబాపై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. తొమ్మిది నెలలక్రితమే ఓ మహిళ అత్యాచారం కేసు పెట్టింది. బెయిల్ పొందగలిగాడు. తాజాగా వీడియోల ఆధారంగా పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించే పనిలోపడ్డారు. ఇద్దరు మహిళలు తాము కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతామని అంగీకరించినట్టు సమాచారం. అయితే మిగిలిన మహిళలు మాత్రం కోర్టుకెక్కితే ఇబ్బందులు కలుగుతాయని సైలెంట్‌గా ఉండిపోతున్నారు.