బర్డ్‌ఫ్లూ వైరస్‌.. చికెన్.. బాతు మాంసం తినొద్దు.. కేంద్రం

బుధవారం, 6 జనవరి 2021 (09:23 IST)
దేశాన్ని మరో వైరస్‌ భయపెడుతుంది. అత్యంత ప్రమాదకరమైన బర్డ్‌ఫ్లూ వైరస్‌ దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోంది. కాశ్మీర్‌ మొదలు కేరళ వరకు వందల సంఖ్యలో వలస పక్షులు ఈ వైరస్‌ బారిన పడి మరణిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలకు హెచ్చరికలు జారీచేసింది. 
 
హర్యానా, జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ రాష్ర్టాల్లో బర్డ్‌ఫ్లూ వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. హర్యానాలో పంచకుల జిల్లాలోని కోళ్ల ఫారాల్లో గత 10 రోజుల్లోనే ఏకంగా 4 లక్షల కోళ్లు మృతి చెందాయి.
 
కేరళలో బర్డ్‌ఫ్లూతో 1700 బాతులు మరణించటంతో అలప్పుజ, కొట్టాయం ప్రాంతాల్లో పెంపుడు కోళ్లు, బాతులన్నింటినీ చంపేస్తున్నారు. కేరళకు దగ్గరగా ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూ భయంతో వణుకుతున్నాయి. కోళ్ల ఫారాలు, పక్షులు పెంపుడు కేంద్రాల్లోకి వైరస్‌ ప్రవేశించకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
 
బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో కొంతకాలం కోళ్లు, బాతుల మాంసం తినొద్దని కేరళ, మధ్యప్రదేశ్‌ అధికారులు ప్రజలకు సూచించారు. కేరళలోని అలప్పుజ జిల్లాలో కోళ్లు ఇతర పక్షుల మాంసం విక్రయాలను నిషేధించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు