ఈ వివరాలను పరిశీలిస్తే, శంకర్ (40) అనే ఉద్యోగి తన పైఅధికారి అయిన కేవీ అయ్యర్‌కు ఉదయం 8:37 గంటలకు ఒక మెసేజ్ పంపారు. "సార్, తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాను. ఈ రోజు ఆఫీసు రాలేను. దయచేసి సెలవు మంజూరు చేయండి" అని అందులో కోరారు.
ఇది సాధారణంగా వచ్చేదే కావడంతో అయ్యర్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఆ సందేశం పంపిన పది నిమిషాలకే, అంటే ఉదయం 8:47 గంటలకు శంకర్ గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు.
ఈ విషయాన్ని అయ్యర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. "ధూమపానం, మద్యపానం వంటి ఎలాంటి చెడు అలవాట్లు లేని శంకర్ ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం నమ్మలేకపోతున్నాను. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం అసాధ్యం" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.