ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఇవ్వాల్సిన కట్నంలో పది సవర్ల బంగారం తగ్గడంతో వరుడు పారిపోయాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా మనవాళన్ నగర్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ముందుగా నిర్ణయించిన ప్రకారం 50 సవర్ల బంగారం ఇవ్వలేదన్న కారణంతో మండపం నుంచి వరుడు పరారయ్యాడు. ఈ సంఘటన తిరువళ్లూరు జిల్లా మనవాలనగర్‌లో సోమవారం (జనవరి-22) ఉదయం చోటుచేసుకుంది.
తిరువళ్లూరు జిల్లా మనవాళన్ నగర్‌కు చెందిన జానకీరామన్ అనే వ్యక్తి విదేశాల్లో పని చేస్తున్నాడు. ఈయన కుమార్తె శోభాలక్ష్మి(25)కి, చెన్నై ఎగ్మోర్‌కు చెందిన ప్రభాకరన్ కుమారుడు శరణ్‌కుమార్‌తో గత సెప్టెంబర్‌లో కోలాహలంగా నిశ్చితార్థం నిర్వహించారు. వివాహ నిశ్చితార్థం సమయంలో 50 సవర్ల బంగారంతో పాటు లక్ష నగదు ఇతర వస్తువులను కట్నంగా ఇవ్వాలని పెళ్లి కుమారుడి తరపున డిమాండ్ చేశారు.
ఆ ప్రకారంగానే కట్నకానుకలు ఇచ్చేందుకు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు అంగీకరించారు. దీంతో జనవరి 21న రిసెప్షన్, 22న పెళ్లి ముహుర్తంగా నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం మనవాళన్ నగర్‌లోని ప్రైవేటు కల్యాణమండపంలో రిసెప్షన్ జరిగింది.
ఈ స్థితిలో ఆదివారం అర్థరాత్రి ఇరు కుటుంబాల మధ్య కట్నం ప్రస్తావన వచ్చింది. ఆ సమయంలో తొలుత ఇస్తామన్నట్టుగా 50 సవర్ల బంగారం ఇస్తామని చెప్పి, తీరా పెళ్లి సమయంలో 40 సవర్ల బంగారం మాత్రమే ఇవ్వడంపై ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. మరో రెండు నెలల్లో పది సవర్ల బంగారం ఇస్తామని వధువు తరపు వారు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
అందుకు వరుడి తరపు వారు అంగీకరించలేదు. దీంతో పెళ్లికి నిరాకరించిన వరుడు, అతని బంధువులు సోమవారం ఉదయం మూడు గంటలకు మండపం నుంచి వెళ్లిపోయారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న వధువు బంధువులు ఆవేదన చెందారు. పెళ్లి కొడుకు ఫోన్ సైతం స్విచాఫ్ చేసి ఉండడంతో మనవాళన్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.