న్యూఢిల్లీ: మద్యం తాగి బండి నడిపారో... మీ జేబులోంచి పది వేల రూపాయలు ఎగిరిపోయినట్లే. కేంద్ర రవాణా సవరణ బిల్లు మందుబాబుల కిక్కు వదిలించేస్తోంది. మనదేశంలో రోడ్డు భద్రత, రవాణా రంగంలో భారీ సంస్కరణలకు కేంద్రం తెరలేపింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారికి భారీ జరిమానాలు విధిస్తూ, రూపొందించిన మోటారు వాహనాల (సవరణ) బిల్లు-2016కు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో రూ.10 వేలు, హిట్ అండ్ రన్ కేసుల్లో రూ. 2 లక్షల జరిమానాను ప్రతిపాదించారు. 18 రాష్ట్రాల రవాణా మంత్రుల సిఫార్సుల మేరకు ఈ బిల్లును రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. గతంలో రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ బిల్లు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉండింది.
గూబ గుయ్‌మనిపిస్తున్న జరిమానాలు...
కేంద్ర సవరణ బిల్లు వాహనాదారుల గూబ గుయ్ మనిపించేస్తోంది. ఓవర్ స్పీడ్‌కు రూ.1,000-4,000 వరకు జరిమానా, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2 వేలు పెనాల్టీ, 3 నెలల జైలు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ. 2వేల జరిమానా, 3 నెలలపాటు లెసైన్స్ రద్దు జువెనైల్స్ అతిక్రమణకు వారి సంరక్షకుడు/యజమానికి రూ.25వేల జరిమానా, మూడేళ్ల జైలు. ఆ వాహన రిజిస్ట్రేషన్ రద్దు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు జరిమానా రూ.100 నుంచి రూ.500కు పెంపు. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తే కనీస జరిమానా రూ. 2వేలు. లెసైన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ.5వేల జరిమానా.
అర్హత లేకుండా వాహనం నడిపితే కనీస జరిమానా రూ.10 వేలు ప్రమాదకర డ్రైవింగ్‌కు జరిమానా రూ.1,000 నుంచి రూ.5 వేలకు పెంపు. తాగి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానా లెసైన్స్ నిబంధనలను ఉల్లంఘించే క్యాబ్ లాంటి వాహనాల వారికి రూ. లక్ష వరకు జరిమానా ఎక్కువ లోడ్‌తో వెళ్లే వాహనాలకు రూ.20వేలు, సీటు బెల్ట్ పెట్టుకోకుంటే రూ.వెయ్యి, హిట్ అండ్ రన్ కేసుల్లో జరిమానా రూ.25 వేల నుంచి రూ.2 లక్షలకు పెంపు. ప్రమాద మృతులకు రూ.10 లక్షల వరకు పరిహారమివ్వాలి. అక్టోబర్ 1, 2018 నుంచి వాహనాలకు ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించాలని నిబంధన పెట్టారు. ఇన్ని నిబంధనల మధ్య ఇక రోడ్డు ఎక్కితే, ఫైన్ గ్యారెంటీ!