ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బాలో ఓ విషాదకర ఘటన జరిగింది. నోట్లో బల్లిపడి రెండున్నరేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, నాగిన్ బంఠా అనే గ్రామానికి చెందిన రాజ్ కుమార్‌కు ముగ్గురు పిల్లలు ఉండగా, వీరిలో ఆఖరి బాలుడి వయసు రెండున్నరేళ్లు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లోని మంచంపై పడుకునివున్నాడు. ఆ సమయంలో అతని తల్లి ఇంట్లోవుండి తన పనుల్లో నిమగ్నమైంది.
ఈ క్రమంలో పిల్లాడి నుంచి ఎలాంటి శబ్దం వినిపించకపోవడంతో అతని వద్దకు వచ్చి చూడగా, అతని నోట్లో బల్లి కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు అక్కడకు వచ్చి చూడగా, బాలుడిని నోట్లో బల్లిపడివున్నట్టు గుర్తించారు. బలి విషం కారణంగానే పిల్లోడు ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు వాపోతున్నారు.
అయితే, జంతుశాస్త్ర నిపుణుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ బలరాం కుర్రే మాట్లాడుతూ, 'బల్లి విషం వల్ల బాలుడు మరణించే అవకాశం లేదు. బల్లి నోట్లో పడడం వల్ల శ్వాశ ఆడక చనిపోయే అవకాశం ఉంది. బాలుడి మరణానికి గల అసలు కారణం తెలియాలంటే పోస్టుమార్టం పరీక్షల ఫలితాలు వస్తేనే తెలుస్తుంది' అని అభిప్రాయపడ్డారు.