నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయండి.. కాంగ్రెస్ డిమాండ్

గురువారం, 27 ఆగస్టు 2020 (10:22 IST)
నీట్, జేఈఈ పరీక్షలపై దుమారం కొనసాగుతోంది. పరీక్షలను నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు నీట్ లాంటి పరీక్షలను జరపడం కూడదని... పరీక్షలను వాయిదా వేయాలనే డిమాండ్ పెరిగిపోతోంది. కరోనా కేసులు పెరుగుతుండడం, రవాణా సదుపాయం లేకపోవడంతో.. నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో JEE, NEET పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆందోళనల్లో పాల్గొనాలని కాంగ్రెస్ కార్యకర్తలు, విద్యార్థులను సోనియా గాంధీ కోరారు. 
 
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో వర్చువల్ మీటింగ్ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు సోనియా గాంధీ. NEET, JEE పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్‌తో పాటు ఆమాద్మీ, బీజేడీ, డీఎంకే, టీఎంసీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.  
 
పరీక్షలను ఇప్పుడే వద్దని విపక్షలు అంటున్నప్పటికీ.. యూనివర్సిటీ ప్రొఫెసర్లు మాత్రం కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్‌, నీట్‌ యూజీ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. కాగా, షెడ్యూల్ ప్రకారమే సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలను నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు