తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావించిన బురేవి తుఫాను ఇపుడు బాగా బలహీనపడిపోయింది. ప్రస్తుతం ఇది పంబన్ తీరానికి అత్యంత చేరువలో కేంద్రీకృతమైవుంది. పంబన్‌కు ఆగ్నేయంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీవ్ర వాయుగుండం శుక్రవారం అర్థరాత్రి తర్వాత రామనాథపురం, తూత్తుకుడి జిల్లా మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
అయితే, ఈ తుఫాను తీరందాటే సమయంలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. భూభాగంపైకి ప్రవేశించిన తర్వాత క్రమంగా బలహీనపడుతుందని వివరించింది. కాగా, ఐఎండీ ఇంతక్రితం తమిళనాడు, దక్షిణ కేరళ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అయితే బురేవి బలహీనపడిన నేపథ్యంలో రెడ్ అలెర్ట్ కొనసాగిస్తారా, లేదా అన్నదానిపై స్పష్టత లేదు.