ఢిల్లీలో ఆరు రోజుల పాటు లాక్డౌన్ .. ప్రకటించిన కేజ్రీవాల్

ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (15:02 IST)
ఢిల్లీని కరోనా వైరస్ కబళించింది. క‌రోనా కేసుల ఉద్ధృతి చేయిదాటిపోవడంతో ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో వారం రోజుల పాటు లాక్డౌన్ పొడగించారు. 
 
నిజానికి వారం రోజుల క్రితం ఆరు రోజుల లాక్డౌన్ ప్ర‌క‌టించారు. ఈ లాక్డౌన్ సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల‌కు ముగియ‌నుంది. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌ లాక్డౌన్‌ పొడిగింపు అవ‌కాశాలేవీ ఉండ‌బోవ‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. ఆ ప‌ని చేయ‌క‌త‌ప్పలేదు. 
 
మరో వారం రోజులపాటు లాక్డౌన్‌ పొడిగిస్తున్న‌ట్లు కేజ్రీవాల్ ఈ రోజు ప్రకటించారు. వ‌చ్చేనెల 3వ తేదీ ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు. 
 
క‌రోనా విజృంభ‌ణ ఉగ్ర‌రూపం దాల్చిన నేప‌థ్యంలో లాక్డౌన్‌ విధించక‌పోతే రానున్న రోజుల్లో ప‌రిస్థితులు మ‌రింత చేజారిపోతాయ‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం భావిస్తోంది. ప్ర‌జ‌లు అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తోంది. ఢిల్లీలో ఆక్సిజ‌న్ కొర‌త కూడా నెల‌కొన్న విష‌యం తెలిసిందే.
 
ఇదిలావుంటే, ఢిల్లీలో ఆక్సిజన్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో సరఫరా కోసం.. తయారీదారులు, సరఫరాదారులు, ఆసుపత్రులతో నిరంతరం సంప్రదిస్తున్నామని తెలిపారు. రెండు గంటలకొకసారి సమాచారం తెలిసేలా.. పోర్టల్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర అధికార బృందాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
 
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులతోపాటు మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో నాలుగురోజుల నుంచి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. 
 
ఈ క్రమంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆక్సిజన్ అందకపోవడంతో… మూడు రోజుల నుంచి దాదాపు 50 మంది రోగులు మరణించారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై.. ఆసుపత్రులకు ఆక్సిజన్‌ను సమకూరుస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు