మే 2 తర్వాత దేశ వ్యాప్తం లాక్డౌన్ : కేంద్రం వ్యూహరచన!

ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (08:48 IST)
భారత్ మరోమారు లాక్డౌన్‌లోకి వెళ్లనుంది. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న కరోనా వైరస్ కేసుల దృష్ట్యా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ వరుస భేటీలను నిర్వహించడానికి ప్రధాన కారణం ఇదేనని భావిస్తున్నారు. 
 
భారతదేశ వ్యాప్తంగా రోజురోజుకు భారీగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు తప్పక దాపురిస్తాయని చెబుతున్నారు విశ్లేషకులు. కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ మరింత బలంగా మారుతుందంటున్న వైద్య నిపుణుల మాటలూ లాక్డౌన్ విధింపు ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతుంది. 
 
ఇక, దక్షిణాది రాష్ట్రాల కరోనా విషయానికి వస్తే, ఏపీ సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్ ఉందని నిర్ధారణ చేసినట్టు సమాచారం. చాలా వేగంగా వ్యాప్తి చెందే దక్షిణాఫ్రికా రకం వైరస్‌ వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోవైపు హెచ్చరికలు కూడా వెలువడుతున్నాయి. ఇక, దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 63 శాతం కేసులు ఉండటం గమనార్హం. 
 
మరోవైపు, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఢిల్లీలో కూడా కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. కొన్ని రాష్ట్రాలు కరోనా కట్టడి చర్యలలో భాగంగా నైట్ కర్ఫ్యూ‌లు అమలు చేస్తుండగా, స్వచ్ఛందంగా గ్రామాల్లో కూడా లాక్డౌన్ విధించుకుంటున్నారు జనం. మే 2వ తేదీన పూర్తి కానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే దేశంలోని పరిస్థితులపై కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. 
 
ఈ సమావేశంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మే, జూన్ నెలలో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున.. సుమారు 80 కోట్ల మంది పేదలకు బియ్యం, గోధులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సమకూర్చనున్నట్టు కేంద్రం నిన్న ప్రకటించడం కూడా దేశ వ్యాప్త లాక్డౌన్‌ కోసమేనని ప్రచారం జోరుగా సాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు