ఈ వివరాలను పరిశీలిస్తే, మాజీ జర్నలిస్టు అనితా చౌధరి. ఈమె తన కుమార్తె పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేసింది. తన ఇంటికి సమీపంలో ఉన్న రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసింది. ఏర్పాట్లన్నీ చేసుకుని రెస్టారెంట్‌కు వెళ్లింది. తీరా అక్కడకు వెళ్లాక కుమార్తెను లోపలకు అనుమతించిన సిబ్బంది ఆమెను మాత్రం ఆపేశారు. అదేంటని ప్రశ్నిస్తే ఆమె చీర కట్టుకొని ఉందని, రెస్టారెంట్లోకి కేవలం స్మార్ట్ క్యాజువల్స్ వేసుకున్న వారికే అనుమతి ఉందని నిర్వాహకులు తెగేసి చెప్పారు.
అనిత, ఆమె కుమార్తె ఎంత వివరించినా ఆ రెస్టారెంటు సిబ్బంది మాత్రం ఆమెను లోపలకు అనుమతించడానికి ససేమిరా అన్నారు. దీంతో బుక్ చేసిన టేబుల్ వదిలేసుకొని ఇంటికి తిరిగెళ్లిపోవాల్సి వచ్చిందని అనిత చెప్పారు. ఈ మొత్తం వివాదాన్ని వీడియో తీసిన ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు.
చీర స్మార్ట్ క్యాజువల్ కాదని తనను రెస్టారెంట్లోకి అనుమతించలేదని, దీని వల్ల తన కుమార్తె పుట్టినరోజు ప్రోగ్రాం చెడిపోయిందని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతోపాటు తను వచ్చిన విధానాన్ని చెప్పేందుకు ఒక సెల్ఫీ కూడా షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆక్విలా రెస్టారెంటుపై మండిపడుతున్నారు.