తీసుకున్న రుణాన్ని మీరు ఎప్పటిలోగా చెల్లిస్తారనే సామర్థ్యాన్ని పరిగణనలోనికి తీసుకుని క్రెడిట్ స్కోరును ఇస్తారు. ఉదాహరణకు మీకు కార్, వ్యక్తిగత రుణం లేదా క్రెడిట్ కార్డుపై రుణం తీసుకుని సమయానికి చెల్లింపులు జరిపితే మీ క్రెడిట్ స్కోరు బాగుంటుంది. ఒకవేళ మీరు సమయానికి డబ్బులు కట్టకపోయినా లేదా ఎగ్గొట్టినా మీ స్కోరు తగ్గిపోయే అవకాశం ఉంది.
ప్రస్తుతం దేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు, ఈ క్రెడిట్ రిపోర్టులు, స్కోరులను అందిస్తున్నాయి. ఇదొక మూడంకెల సంఖ్య, స్కోరు 750 పైన ఉంటే, మంచిది. అంతకంటే తక్కువ ఉంటే కష్టమే. క్రెడిట్ స్కోరు బాగుంటే మీరు సులభంగా రుణాలను పొందవచ్చు. అలాగే తక్కువ వడ్డీకే రుణాలను పొందే వీలు కూడా ఉంది.