రేవంత్ రెడ్డి మూలాలు ఎక్కడ? కాంగ్రెస్‌పై అమరీందర్ ఫైర్

శుక్రవారం, 22 అక్టోబరు 2021 (11:56 IST)
కాంగ్రెస్ పార్టీపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మరోమారు తీవ్ర విమర్శలు గుప్పించారు. సెక్యులరిజం గురించి మాట్లాడటం కాంగ్రెస్ పార్టీ మానుకోవాలని హితవు పలికారు. 
 
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, నానా పటోలే వంటి నాయకులు ఆరెస్సెస్ నుంచి వచ్చారన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు. బీజేపీ నుంచి వచ్చిన సిద్ధూను నెత్తిన పెట్టుకున్నారని, మహారాష్ట్రలో శివసేనతో జట్టు కట్టారంటూ దెప్పిపొడిచారు. 
 
పంజాబ్‌లో కొత్త పార్టీ పెట్టి బీజేపీతో పొత్తు అంశంపై పరిశీలిస్తామని ఇటీవల అమరీందర్ ఓ ప్రకటన చేసిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. ఆ పార్టీ సీనియర్ నేత హరీశ్ రావత్ మాట్లాడుతూ తనలోని సెక్యులర్ అమరీందర్‌ను ఆయన చంపుకొన్నారన్నారు. 
 
ఈ వ్యాఖ్యలకు ప్రతిగా అమరీందర్ కాంగ్రెస్‌పై ఇలా విరుచుకుపడ్డారు. మరోవైపు, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగుచట్టాల నిర్మాత అమరీందరేనని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేసి ఆ పార్టీతో జతకట్టేందుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు