పెళ్లి జరుగుతోంది.. అయినా మందేసి చిందేశాడు వరుడు. అంతే వధువు ఛీ పొమ్మంది. పెళ్లి వద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో సదరు మగపెళ్లివారికి దిమ్మ తిరిగిపోయింది. ఈ ఘటన యూపీలోని పీలీభీత్‌లో ఒక పెళ్లి వేడుకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షాజహాన్‌పూర్ పరిధిలోని మవియాపూర్ నుంచి మగపెళ్లివారు బిస్లండాకు మందీ మార్బలంతో వచ్చారు.
కరోనా నిబంధనల్ని ఉల్లంఘించి వందమందికి పైగా వచ్చారు. దీంతో ఆడపెళ్లివారు ఈ కరోనా సమయంలో నిబంధనలు ఉన్నాయి కదాని అడిగారు. దీంతో మగపెళ్లివారికి కోపం వచ్చింది. ఆడపెళ్లివారిదో గొడవకు దిగారు. అప్పటికే మద్యం తాగి డ్యాన్సులేసుకుంటూ వచ్చిన మగపెళ్లివారు మరింతగా ఆడపెళ్లివారిపై రెచ్చిపోయారు. అలా అలా గొడవ పెద్దదైంది.
అది ఎంత వరకూ వెళ్లిందంటే మగపెళ్ళివారు పెళ్లికుమార్తె సోదరుడు, చిన్నాన్నలను కొట్టేదాకా వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న పెళ్లికుమార్తె తనకు ఈ పెళ్లి వద్దంటూ ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో వివాదం మరింత ముదరింది. ఒక ఆడదానికి ఇంత పొగరా? అని మగపెళ్లివాళ్లు మరింతగా రెచ్చిపోయారు. నానా మాటలు అన్నారు. మా పరువు పోయిందంటూ గెంతులేశారు.
ఇలా ఈ గొడవకాస్తా పోలీసుల వరకూ చేరింది. పోలీసులు పెళ్లి వేదిక వద్దకు వచ్చారు. ఇరు తరపు వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. కానీ వధువు మాత్రం ఈ పెళ్లి తనకొద్దని చెప్పేసింది. దీంతో మగపెళ్లివారికి తలకొట్టేసినట్లై.. ఏం చేయాలో తెలీక తాగిందంతా దిగిపోవడం ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. ఆత్మాభిమానంతో మాట్లాడిన ఆ పెళ్లికూతురు నిర్ణయం చాలా చాలా మంచిదేనని పలువురు అంటున్నారు.