ఇంటి నిర్మాణపనుల్లో అపశృతి : కరెంట్ షాక్ తగిలి ఆరుగురి మృతి

ఆదివారం, 11 జులై 2021 (16:01 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన ఒకటి జరిగింది. ఇంటి నిర్మాణ పనుల్లో జరిగిన అపశృతి కారణంగా ఒకే ఇంటికి చెందిన ఆరుగురు మృత్యువాతపడ్డారు. వీరంతా కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు విడిచారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛత్తర్‌పూర్ జిల్లా మహువా ఝాలా గ్రామంలో ఇంటి నిర్మాణ పనులు జరుగుతుండగా ఆ ఆరుగురు విద్యుత్ షాక్‌కు గురయ్యారని పోలీసులు చెప్పారు. 
 
ఇంటి పైకప్పు వేసేందుకు వినియోగించే ప్లేట్లను తీసేందుకు ఓ వ్యక్తి ట్యాంకులోకి దిగాడని, అయితే, ట్యాంక్‌లో లైటింగ్ కోసం ఏర్పాటు చేసిన వైర్ల వల్ల ఆ ప్లేట్లలోకి కరెంట్ పాసయ్యి అతడు షాక్‌కు గురయ్యాడని తెలిపారు.
 
అతడిని కాపాడేందుకు ట్యాంకులోకి దిగిన మిగతా ఐదుగురూ కరెంట్ షాక్‌కు గురయ్యారన్నారు. విద్యుత్ సరఫరాను ఆపేసి వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయారని డాక్టర్లు చెప్పారన్నారు. మరణించిన వారు 20 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్నారన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు