కొన్ని రోజులు కలిసివుంటే సహజీవనం అనిపించుకోదు : హర్యానా హైకోర్టు

శుక్రవారం, 17 డిశెంబరు 2021 (14:52 IST)
యువతీయువకుడు లేదా స్త్రీపురుషుడు కొన్ని రోజుల పాటు ఒక గదిలో కలిసివున్నంత మాత్రాన సహజీవనం అనిపించుకోదు అని పంజాబ్, హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఓ యువతీయువకుడు ఇంటి నుంచి పారిపోయి ఓ హోటల్ గదిలో కొన్ని రోజులు పాటు ఉన్నారు. వీరిద్దరూ తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. అలాగే, ఆ జంటకు 25 వేల రూపాయల అపరాధం సైతం విధించింది.
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, హర్యానా రాష్ట్రంలోని యమునానగర్ జిల్లాకు చెందిన 18 యేళ్ళ యువతి, 20 యేళ్ల యువకుడు కొన్ని నెలలుగా ప్రేమించుకుంటుంన్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఇద్దరినీ మందలించారు. దీంతో గత నెల 24వ తేదీన ఈ జంట పారిపోయి హోటల్‌లోని ఓ గదిలో ఉంటున్నారు. ఈ క్రమంలో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆ జంట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 
అంతేకాకుండా, అమ్మాయి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, అమ్మాయిపై తప్పుడు కేసు పెట్టాలని చూస్తున్నారనీ అందువల్ల రక్షణ కల్పించాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి, ఈ ప్రేమ జంట చేస్తున్న ఆరోపణలు నమ్మశక్యంగా లేవన్నారు. పైగా, సహజీవనం అంటే కొన్ని రోజులు కలిసివుండటం కాదనీ, దాను వెనుక మరెన్నో బాధ్యతలు కూడా ఉంటాయని గుర్తుచేశారు. ఇలాంటి పిటిషన్‌ను దాఖలు చేసిన ప్రేమ జంటకు రూ.25 వేల అపరాధం విధిస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు