యూపీ బరేలీలోని బహెడి ప్రాంతంలోని ఒక గ్రామంలో గణేష్ చతుర్థి కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా 15 ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన సెప్టెంబర్ 19న జరిగింది. అయితే శనివారం బాధితురాలి తల్లి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై రాజా గుప్తా, శివం గుప్తా, అన్షుల్ గుప్తా, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై భారతీయ శిక్షాస్మృతి - పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద బహెడి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాజా, శివమ్‌లను ఆదివారం అరెస్టు చేశారు. బాధితురాలి ప్రైవేట్ భాగాలపై పలు గాయాలు ఉండటంతో పోలీసులు జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ ఘటనపై ఏఎస్పీ ముఖేష్ చంద్ర మిశ్రా మాట్లాడుతూ, "నిందితులపై ఐపీసీ సెక్షన్లు 376 డీ (గ్యాంగ్ రేప్), 506 (క్రిమినల్ బెదిరింపు)తో పాటు POCSO చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. ఇద్దరు నిందితులు కస్టడీలో ఉన్నారు." అంటూ తెలిపారు.