ప్రస్తుతం దేశంలో సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం.. రాష్ట్రాల అధికారులను హరించి మున్సిపాలిటీల స్థాయికి తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే రాజ్యాంగాన్ని పరిరక్షించడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.
ఆదివారం చెన్నైలో డీఎంకే - కాంగ్రెస్ ఎంపీల మద్దతు కోరుతూ ఆయన ఓ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన ప్రసంగిస్తూ, దేశంలో అధికారాన్ని కేంద్రీకరించే ప్రయత్నాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి గొడ్డలిపెట్టులాంటిది. జీఎస్టీ విధానంలో మార్పులు తీసుకురావడం, రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా విధానాలు రూపొందించడం వంటి చర్యలు సమాఖ్య వ్యవస్థను తీవ్రంగా బలహీనపరుస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఇలాగే కొనసాగితే, రాష్ట్రాలు తమ ప్రాముఖ్యతను కోల్పోయి కేవలం మున్సిపాలిటీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు.
దేశమంటే రాష్ట్రాల సమాహారం అనే విషయాన్ని అందరూ గుర్తించాలని జస్టిస్ రెడ్డి నొక్కి చెప్పారు. భారతదేశ బలం భిన్నత్వంలో ఏకత్వంలోనే ఉంది. మన రాజ్యాంగం కూడా రాష్ట్రాల ఐక్యతకే పెద్దపీట వేసింది. ఈ ప్రాథమిక సూత్రాన్ని కాపాడుకున్నప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. సమాఖ్య హక్కుల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ గట్టిగా పోరాడుతున్నారని ప్రశంసించారు.
తన న్యాయవాద వృత్తిని గుర్తుచేసుకుంటూ, గత 52 ఏళ్లుగా న్యాయమూర్తిగా నేను రాజ్యాంగాన్ని నిలబెట్టాను. ప్రజలు నాకు అవకాశం ఇస్తే, భవిష్యత్తులో కూడా రాజ్యాంగాన్ని కాపాడటానికి, దాని విలువలను పరిరక్షించడానికి కట్టుబడి ఉంటాను. నాపై నమ్మకం ఉంచిన ప్రజలను గానీ, రాజ్యాంగాన్ని గానీ నేను ఎప్పటికీ నిరాశపరచను అని మీ ఇచ్చారు.