ఛత్తీస్‌ఘడ్‌లో దారుణం: కట్నం కోసం సామూహిక అత్యాచారం.. 45 రోజులు బంధించి..
సోమవారం, 27 డిశెంబరు 2021 (13:28 IST)
ఛత్తీస్‌ఘడ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. కవార్ధాలో కట్నంలో భాగంగా వాహనం ఇవ్వకపోవడంతో కోడలిని 45 రోజులుగా బందీగా ఉంచింది ఓ కుటుంబం. అంతటితో ఆగకుండా ఆమెపై కుటుంబ సభ్యులే అత్యాచారానికి ఒడిగట్టి సభ్య సమాజం తలదించుకునేలా చేశారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన వారిలో సొంత తాత, మామ, బావలు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మంది కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఈ కేసులో బాధితురాలు 181 మహిళా హెల్ప్‌లైన్ రాయ్‌పూర్ ద్వారా నవంబర్ 18న ఫిర్యాదు లేఖను పంపింది. ఇందులో భర్త, అతని కుటుంబసభ్యులపై వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి కౌన్సెలింగ్ చేసినప్పుడు, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు లేఖ ఆధారంగా మహిళా సెల్ కవర్ధా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
బాధితురాలికి గతేడాది జనవరిలో అవధేష్ సాహుకు అమల్గి వాలేతో వివాహం జరిగింది. వివాహం సమయంలో కట్నం ఇచ్చినా పెళ్లయిన రెండు మూడు రోజులకే కోడలికి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. భర్త అవధేష్ సాహు, బావ ఓం ప్రకాష్ సాహు, అత్తగారు అనితా బాయి, బావ దోమన్‌లు పెళ్లిలో కట్నం ఇవ్వలేదని ఆమెను వేధించడం మొదలుపెట్టారు.
అయితే పెళ్లైన నెల రోజులకే అంటే ఫిబ్రవరి 2020లో కోడలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె బావ అఘాయిత్యం చేశాడు. మహిళను బెదిరించి అత్యాచారం చేశాడు. మార్చి 21, 2020 నుంచి 45 రోజుల పాటు నానా మామ నారాయణ్ సాహుతో సహా హల్ధర్ సాహు, కార్తీక్‌రామ్ సాహు, పెద్ద బావ ఛబీ రామ్, మరో బావ హేమంత్ అందరూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. చిత్రహింసలు పెట్టారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై వరకట్న వేధింపులతో పాటు సెక్షన్లు- 342, 344 498(A), 376(2) కింద కేసు నమోదు చేశారు.
విచారణ అనంతరం కట్నంగా ఇచ్చిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు. ఈ కేసులో ఒక నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు కొనసాగుతోందని కుంట పోలీసులు తెలిపారు.