నేడు హర్యానాలో మనోహర పట్టాభిషేకం... డిప్యూటీ సీఎంగా దుష్యంత్

ఆదివారం, 27 అక్టోబరు 2019 (10:49 IST)
హర్యానా రాష్ట్రంలో ఆదివారం అంటే దీపావళి పండుగ రోజే కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేసమయంలో ఉప ముఖ్యమంత్రిగా దుష్యంత్ చౌతలా ప్రమాణం చేస్తారు. ఈయన జేజేపీ పార్టీకి అధినేతగా ఉన్నారు. అలాగే, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వంలో భాగస్వాములు కానున్నారు. 
 
ఆదివారం మధ్యాహ్నం 2:15 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు శనివారం ఉదయం కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో బీజేపీ శాసనసభా పక్షం సమావేశమైంది. ఎమ్మెల్యేలంతా తమ నాయకుడిగా ఖట్టర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 
 
అనంతరం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా సమర్థమైన పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ సందర్భంగా ఖట్టర్‌ను అభినందించారు. హర్యానాలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడనున్నదని, సమర్థవంతమైన, పారదర్శకమైన పాలన అందిస్తుందని తెలిపారు.
 
అనంతరం ఖట్టర్‌ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ సత్యదేవ్‌ను కలిశారు. జేజేపీతోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు లేఖలను ఆయనకు అందించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అనంతరం ఖట్టర్‌ మీడియాతో మాట్లాడుతూ.. 90 మంది ఉన్న అసెంబ్లీలో తమకు మొత్తం 57 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నట్టు చెప్పారు. 40 మంది బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు 10 మంది జేజేపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్రులు మద్దతు ఇస్తున్నట్టు వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు