బెలూన్ హెల్మెట్స్... ఐఐటీ రూర్కెలా శాస్త్రవేత్తల సృష్టి

మంగళవారం, 26 జూన్ 2018 (17:58 IST)
దేశవ్యాప్తంగా వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదేసమయంలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారి సంఖ్యా నానాటికీ పెరిగిపోతోంది. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు హెల్మెట్లు ధరించాలంటూ ట్రాఫిక్ పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నో రకాల అవగాహనా ప్రచారాలు నిర్వహిస్తూ వచ్చారు.
 
ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రాణాలు కాపాడే భద్రమైన హెల్మెట్‌ను ఐఐటీ రూర్కెలాకు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. అంతరిక్షంలో నిర్మాణాల్లో వాడే ఇన్‌ఫ్లేటబుల్‌ టెక్నాలజీని హెల్మెట్‌ తయారీలో ఉపయోగించారు. 
 
అంతరిక్షంలో నిర్మాణాన్ని చేపట్టినప్పుడు.. మొత్తం భవంతి అంతా ఒక లాంచ్‌ వెహికల్‌లోకి వచ్చేస్తుంది. ముందుగా నిర్ధేశించిన కక్ష్యను చేరుకున్న తర్వాత.. దానిని బయటకు వదులుతారు. అక్కడ చిన్న యంత్రాలతో దానిని పూర్తిస్థాయి నిర్మాణంగా మారుస్తారు. 
 
ఇప్పుడు ఈ టెక్నాలజీ స్ఫూర్తితోనే ఐఐటీ రూర్కీకి చెందిన శాస్త్రవేత్తలు వినూత్న హెల్మెట్‌ను తయారు చేశారు. ఈ హెల్మెట్‌ ఒక కాలర్‌ మాదిరిగా ఉంటుంది. దీనిని మెడకు ధరించాలి. దీనిలో ఉండే సెన్సార్లు వాహనదారుడు ఎంత వేగంగా వెళ్తున్నాడు.. సమీపంలో వాహనాలేమైనా ఉన్నాయా.. వంటి అనేక విషయాలను గమనిస్తూ ఉంటాయి. 
 
వాహనానికి బలంగా ఏదైనా తగిలినా.. వాహనం కుదుపునకు గురైనా.. మెడ చుట్టూ ఉన్న హెల్మెట్‌.. తల చుట్టూ బెలూన్‌లా విచ్చుకుంటుంది. పైగా, ఈ హెల్మెట్ ధరించడం వల్ల సాధారణ హెల్మెట్లతో పోల్చితే తలపై ఒత్తిడి మూడు రెట్లు తగ్గింది. 
 
ఈ హెల్మెట్‌ పెట్టుకోవటం వల్ల తలపై పడే ఒత్తిడి మూడు రెట్లు తగ్గింది. దీనివల్ల తలకు గాయాలు తగిలే అవకాశాలు చాలా తక్కువ. మామూలు హెల్మెట్ల కన్నా ఇవి చాలా సమర్థంగా పనిచేస్తాయి. అయితే ఎక్కువ సంఖ్యలో హెల్మెట్లను తయారు చేయాలంటే ఇంకొన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది అని ఈ హెల్మెట్‌ రూపకర్త ప్రొఫెసర్‌ సంజయ్‌ ఉపాధ్యాయ వెల్లడించారు. ఇస్రో రూపొందిస్తున్న ఇన్‌ఫ్లేటబుల్‌ యాంటీనా తమకు స్ఫూర్తి అని ఆయన తెలియజేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు