పహల్గాం దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నా సంపూర్ణ మద్దతు : రాహుల్ గాంధీ

ఠాగూర్

శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (17:20 IST)
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నప్పటికీ తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇలాంటి క్లిష్టసమయంలోనే భారతీయులంతా ఐక్యంగా ఉండాలని, తద్వారా ఉగ్ర చర్యలను వారి లక్ష్యాలను ధీటుగా ఎదుర్కోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం శ్రీనగర్‌లో పర్యటించిన ఆయన... ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌, ముఖ్యమంత్రులతో భేటీకావడంతో పాటు ఉగ్రదాడి బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. 
 
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, "సమాజాన్ని విభజించడం, సోదరుల మధ్య తగాదాలు సృష్టించడమే ఉగ్రవాదుల పని. ఈ ఉగ్రచర్యను జమ్మూకాశ్మీర్ మొత్తం ఖండించింది. వీరికి యావత్ దేశం మద్దతుగా నిలిచింది. భారతీయులంతా ఐక్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. అపుడే ఉగ్ర చర్యలను, వారి ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కోగలం. కాశ్మీర్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిపై కొందరు దాడులు చేయడం అత్యంత బాధాకరం. మనందరం ఐక్యంగా ఉండి ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలి. లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రితోనూ సమావేశమయ్యాను. ఏం జరిగిందో వారు వివరించారు. మా పార్టీ త రపున పూర్తి మద్దతు ఉంటుందని వారిద్దరికీ హామీ ఇచ్చాను" అని వెల్లడించారు. 
 
మరోవైపు భారత ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ చీఫ్ ఉపేంద్ర ద్వివేదీ కాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా ఆయన సమావేశమయ్యారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ కాశ్మీర్‌లో పర్యటించడం, వరుస సమీక్షలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు