తమిళనాట బీజేపీ జెండా ఎగిరేందుకు రంగం సిద్ధం అయ్యింది. ప్రాంతీయ పార్టీలకు పెట్టని కోటలా ఉన్న తమిళనాడు.. ఇక జాతీయ పార్టీలకు గేట్లు తెరవక తప్పని పరిస్థితులు నెలకొన్నాయనే వాదన వినిపిస్తోంది. ఏళ్లపాటు పోరాడుతున్నప్పటికీ.. అక్కడ ఏదో ఒక ప్రాంతీయ పార్టీ లేకుండా ఏ పార్టీకి సింగిల్ సీటు కూడా దక్కని పరిస్థితి. అయితే ప్రస్తుతం సీన్ మారింది. కేంద్రంలోని పార్టీలు తమిళనాడు వైపు చూస్తున్నాయి.
తమిళనాట బీజేపీలో పాగా వేయాలని పక్కా ప్రణాళికలు చేస్తున్నారు. తాజాగా తమిళ తంబీలంతా అమ్మగా పిలుచుకునే దివంగత సీఎం జె.జయలలిత శకం ముగిసింది. మూడు దశాబ్దాలకు పైగా అన్నాడీఎంకేను తిరుగులేని రాజకీయ శక్తిగా నడిపించిన జయ… అనారోగ్యంతో ఇటీవలే కన్నుమూశారు. జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ పగ్గాలను చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యమైంది. ఎందుకంటే… ఎప్పటినుంచో తమిళనాట జెండా పాతేందుకు బీజేపీ కాసుకుని కూర్చుంది. ఇందులో భాగంగా అనారోగ్యంతో జయ ఆసుపత్రిలో చేరగానే తనదైన మంత్రాంగంతో ఎంట్రీ ఇచ్చింది.
వరుసగా కేంద్ర మంత్రులు తమిళనాడు రావడం, జయ ఆరోగ్యంపై వాకబు చేయడం, జయను పమార్శించేందుకే వచ్చామంటూ తమిళ తంబీలకు దగ్గరయ్యారు. దీంతో తమిళనాట కేంద్ర మంత్రులు చక్రం తిప్పారు. ఇందులో భాగంగా బీజేపీకి జయ స్థానంలో తమిళనాడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఒ.పన్నీర్ సెల్వం కనిపించారు.