భారత నౌకాదళం తమ సత్తాకు నిదర్శనంగా నిలిచే ఒక చిత్రాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేసింది. సముద్ర గస్తీలో ఉన్న కీలక యుద్ధనౌక, జలాంతర్గామి, తేలికపాటి హెలికాఫ్టర్‌తో కూడిన ఈ ఫోటో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ ఫోటోలో ఐఎన్ఎస్ కోల్‌కతా అనే విధ్వంసక నౌక, స్కార్పీన్ శ్రీణికి చెందిన జలాంతర్గామి, ధృవ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాఫ్టర్ (ఏఎల్‌హెచ్) తమ విధుల్లో నిమగ్నమై ఉండటాన్ని చూడొచ్చు.
భారత నేవీ త్రిశూల శక్తి.. సముద్రంపైన.. నీటి కింది.. సమద్ర అలలు మీదుగా అని అర్థం వచ్చేలా ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఎనీ టైమ్.. ఎనీ వేర్ .. ఎనీ హౌ అనే క్యాషన్‌ను జతచేసింది. ఇది సముద్ర జలాల్లో నిరంతరాయంగా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కార్యకలాపాలు నిర్వహించగల తమ సామర్థ్యాన్ని సూచిస్తోంది.
ఇటీవల పహల్గాంలో పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని కాల్చి వేసిన విషయం తెల్సిందే. దీంతో పాకిస్థాన్, భారత్ దేశాల మధ్య యుద్ధ వాతావారణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో భారత నౌకాదళం ఈ ఫోటోను షేర్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఈ ఫోటోలో కనిపిస్తున్న ధృవ్ ఏఎల్‌హెచ్ హెలికాఫ్టర్లు కార్యకలాపాలను కొన్ని నెలల క్రితం తాత్కాలికంగా నిలిపివేశారు.