పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్, గురుదాస్ పూర్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన స్థానిక పంజాబ్ నేతలతో కలిసి పర్యటించారు. ఈ పర్యటన నేపథ్యంలోనే పంజాబ్ పోలీసులకు ఆయన మండిపడ్డారు. అక్కడ ఉన్న ఓ సరిహద్దు గ్రామాన్ని సందర్శించేందుకు పోలీసులు అభ్యంతరం తెలుపడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
గురుదాస్‌పూర్‌లోని రావి నది అవతల ఉన్న సరిహద్దు గ్రామమైన తూర్‌లోని వరద బాధితులను కలుసుకోవాలని రాహుల్ గాంధీ భావించారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పంజాబ్ పోలీసులు అందుకు నిరాకరించారు. ఈ క్రమంలో రాహుల్ వారిపై విరుచుకుపడ్డారు.
భారత భూభాగంలోనే నన్ను సురక్షితంగా ఉంచలేమని చెబుతున్నారా? అని ప్రశ్నించగా, మిమ్మల్ని రక్షించేందుకు ఎపుడూ సిద్ధంగా ఉంటాం అని పోలీసులు సమాధానమిచ్చారు. కానీ రావి నది అవతల ఉన్న గ్రామాన్ని చూపిస్తూ భారతదేశం అని చెబుతున్నారు. ఇది భారత్ కాదా? మీరు రక్షించలేనందున నన్ను అక్కడ నుంచి వెళ్లొద్దని చెబుతున్నారా? అంటూ పోలీసులపై మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.