అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాల మోత మోగించింది. అయినా భారత్ ఏమాత్రం తలొగ్గలేదు. పైగా భారత్ - అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వాటిలో కదలిక రానున్నట్లు కనిపిస్తోంది. సోమవారం రాత్రికి అమెరికా ప్రతినిధి భారత్‌కు రానున్నారని కేంద్ర ప్రభుత్వ అధికారులు మీడియాకు వెల్లడించారు. దాంతో మంగళవారం రెండు దేశాల మధ్య మళ్లీ చర్చలు జరగనున్నాయని పేర్కొన్నాయి.
అయితే ఒప్పందంలో మొదటి దశను ఈ ఏడాది అక్టోబరు - నవంబరు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదిలాఉంటే.. భారత ప్రధాని మోడీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానంటూ ట్రంప్ పోస్ట్ పెట్టగా.. తాను కూడా అమెరికా అధ్యక్షుడితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానని మన ప్రధాని బదులిచ్చారు. ఈ నేపథ్యంలో యూఎస్ ప్రతినిధి భారత్ పర్యటన చోటుచేసుకుంటోంది.
రష్యాతో భారత్ కొనసాగిస్తున్న విధానాలపై ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో పదే పదే నోరుపారేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాల వేళ.. నవారో మళ్లీ స్పందించారు. చర్చలకు భారత్‌ను ఒప్పించామనే అర్థంలో వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇరుదేశాల మధ్య చర్చలు సానుకూలంగానే కొనసాగుతున్నాయని, ఇరుపక్షాలు సంతృప్తికరంగా ఉన్నాయని భారత వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల పేర్కొన్నారు.