కర్ణాటక రాజకీయాలు మలుపు?

బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (06:09 IST)
కర్ణాటక రాజకీయాలు మలుపు తిరుగుతున్నాయి. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంపై గత ఏడాది తిరుగుబాటు బావుటా ఎగురవేసి యడియూరప్ప సర్కార్ ఏర్పాటుకు సహకరించిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు కొందరు మళ్లీ జేడీఎస్‌ దారి పట్టనున్నారు.

బీజేపీలో చేరినప్పటికీ కేబినెట్‌లో పదవులు ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వస్తామంటే పరిశీలిస్తాంటూ జేడీఎస్ రాష్ట్ర విభాగం హెచ్‌కే కుమారస్వామి తాజాగా పేర్కొనడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
 
'పార్టీని వదలిపెట్టి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు వెనక్కి వచ్చి తిరిగి జేడీఎస్‌లో చేరాలని కోరుకుంటే ఆ అంశాన్ని పార్టీ పరిశీలిస్తుంది. పొరపాటు చేసినట్టు అంగీకరిస్తే వారిని తిరిగి పార్టీలో చేర్చుకునే వీలుంది' అని కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
 
గత ఏడాది జేడీఎస్‌ను వీడి బీజేపీలో చేరిన రాజు గౌడ, హెచ్.విశ్వనాథ్, ఎంబీటీ నాగరాజ్‌ సహా పలువులు ఎమ్మెల్యేలకు ఈనెల 6న యడియూరప్ప జరిపే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశం లేదని వినిపిస్తుండటంతో వారు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

తిరిగి తమ పాతగూటికే చేరేందుకు పలువురు జేడీఎస్, కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. కాగా, అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించే విషయమై పార్టీ అంతర్గత సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నందున గురువారం వరకూ ఎమ్మెల్యేలు వేచిచూడాల్సి ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
 
కుమారస్వామి సారథ్యంలోని 14 నెలల కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం గత ఏడాది జూలైలో 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కుప్పకూలింది. ఎమ్మెల్యేల రాజీనామాతో కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది.

పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అప్పటి స్పీకర్ కేఆర్ రమేష్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఈ విషయమై ఎమ్మెల్యేల అనర్హతను సమర్ధించిన సుప్రీంకోర్టు....ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం రెబల్ ఎమ్మెల్యేలను అనుమతించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు