కర్ణాటక, తమిళనాడుల్లో కలిపేయండి: చిత్తూరు జిల్లా వాసుల డిమాండ్
గురువారం, 9 జనవరి 2020 (18:37 IST)
తమను కర్నాటక లేదా తమిళనాడు లో కలిపేయాలని చిత్తూరు జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖతో పోల్చితే ఈ రెండు రాష్ట్రాల రాజధానులు జిల్లా ప్రజలకు చాలా దగ్గర కావడం.. జిల్లా గతంలో తమిళనాడులో కలిసి ఉండడం.. పూటకో నిర్ణయం తీసుకుంటున్న ప్రభుత్వం మీద అసహనం.. వంటి కారణాలతో ప్రజలు ఈ దిశగా ఆలోచిస్తున్నారు.
మరికొందరు తిరుపతిని రాజధానిగా మార్చాలని కోరుతున్నారు. ఆధ్యాత్మిక నగరం కావడం, భవనాలు సిద్ధంగా ఉండడంతో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరుతో పాటు కడప జిల్లాను కూడా కర్ణాటక, తమిళనాడులతో కలిపేయాలని మరికొందరు కోరుతున్నారు.
విశాఖ అయితే ఇబ్బందులివీ..
కుప్పం, పుంగనూరు, పలమనేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, చిత్తూరు, జీడీనెల్లూరు, పీలేరు, పూతలపట్టు వంటి పడమటి ప్రాంతాల ప్రజలకు కర్ణాటక రాజధాని బెంగళూరు బాగా దగ్గర అవుతుంది. అంటే 100 నుంచి 200 కిలోమీటర్ల మధ్య దూరం ఉంటుంది. రెండు, మూడు గంటల్లో వెళ్లిపోవచ్చు.
ఇక శ్రీకాళహస్తి, సత్యవేడు, తిరుపతి, నగరి, చంద్రగిరి వంటి ప్రాంతాల నుంచి చెన్నై దగ్గరగా ఉంది. పూతలపట్టు, పీలేరు, జీడీనెల్లూరు, చిత్తూరు, పలమనేరు వంటి ప్రాంతాల ప్రజలకు రెండు నగరాలూ బాగా దగ్గరే. అదే విశాఖ అయితే జిల్లాలోని ఏ ప్రాంతం నుంచి చూసుకున్నా.. సరాసరి 900 కిలోమీటర్ల దూరం ఉంది. ముఖ్యంగా కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె ప్రజలు, రాజధానిలో పనిఉండేవాళ్లు విశాఖ వెళ్లాలంటే మరీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఇక కనీసం నెలకోసారి రాజధానికి వెళ్లాల్సి వచ్చే జిల్లా అధికారుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనీసం నాలుగు పనిదినాలతో పాటు వ్యయం కూడా అధికంగా ఖర్చు అవుతుంది.
బెంగళూరు, చెన్నైలతో అనుకూలతలు....
జిల్లాలోని ఏ ప్రాంతం నుంచి అయినా విశాఖకు వెళ్లి రావాలంటే మూడు రోజులు పడుతుంది. అదే పొరుగు రాష్ట్రాల రాజధానులు బెంగళూరు, చెన్నైలకు జిల్లాలోని ఏ ప్రాంతం నుంచి బయల్దేరినా.. పనులు చక్కబెట్టుకుని సాయంత్రానికి వచ్చేయవచ్చు.
జిల్లావాసుల్లో అధికులు ఈ నగరాల్లో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్ధిరపడ్డారు. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మనవాళ్లకు మంచి పట్టు కూడా ఉంది. ఏళ్ల తరబడి అక్కడే వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడడంతో అలవాటు పడిపోయారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం విశాఖ రాజధాని అని ప్రకటించడంతో ఆందోళన చెందుతున్నారు.