ఏపీలో టీడీపీ - తమిళనాడులో డీఎంకే : విస్తృతంగా తనిఖీలు

శనివారం, 30 మార్చి 2019 (12:21 IST)
ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేందుకు కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార  టీడీపీకి చెందిన అభ్యర్థుల ఇళ్ళలో ఇటీవలే సోదాలు జరిగాయి. ఇపుడు తమిళనాడు రాష్ట్రం వంతు వచ్చింది. ఇక్కడ విపక్ష డీఎంకేకు చెందిన అభ్యర్థుల ఇళ్ళపై ఐటీ సోదాలు నిర్వహించారు. 
 
ముఖ్యంగా, డీఎంకే కోశాధికారి, పార్టీ సీనియర్ నేత అయిన దురైమురుగన్ నివాసంతో పాటు... ఆయనకు చెందిన కాలేజీల్లో ఈ సోదాలు జరిగాయి. జిల్లా కేంద్రమైన వేలూరులోని ఆయన నివాసానికి శనివారం వేకువజామున చేరుకున్న అధికారులు సోదాలు ప్రారంభించారు. అదేసమయంలో మరో టీమ్ కింగ్‌స్టన్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్, దురై మురుగన్‌ బీఈడీ కాలేజీల్లో తనిఖీలు చేపట్టాయి. 
 
మరోవైపు అరక్కోణంలో భారీ నగదు ఉందని సమాచారం ఉంటే అక్కడ తనిఖీలు చేయకుండా తమ ఇల్లు, కాలేజీల జోలికి రావడం ఏంటని డీఎంకే నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా డీఎంకే వర్గాలు, అధికారులకు వాగ్వాదం చోటుచేసుకుంది.
 
సరైన సెర్చ్ వారెంట్ లేనందున తనిఖీలు చేపట్టనివ్వమని డీఎంకే కార్యకర్తలు స్పష్టం చేయడంతో అధికారులు వెనుదిరిగారు. అనంతరం కొద్దిసేపటికే ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ విజయ్‌ దీపన్‌ నేతృత్వంలో మరో బృందం మురుగన్‌ ఇంటికి చేరుకుని సోదాలు చేసింది. ఈ ఎన్నికల్లో ఓడిపోతామని అన్నాడీఎంకేకు తెలిసిపోయిందని, అందుకే కేంద్రం అండతో ఐటీ దాడులు జరిపిస్తోందని దురైమురుగన్ ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు