కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు కరోనా

గురువారం, 20 ఆగస్టు 2020 (15:14 IST)
మరో కేంద్ర మంత్రి కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయన పేరు గజేంద్ర సింగ్ షెకావత్. కేంద్ర జలశక్తి మంత్రిగా కొనసాగుతున్నారు. తనకు కరోనా వైరస్ సోకినట్టు ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తనలో కొన్ని కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నానని... పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు.
 
వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరబోతున్నట్టు చెప్పారు. అలాగే, తనతో కాంటాక్ట్‌ అయినవారంతా ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పైగా, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్ట్ చేయించుకోవాలని, ఐసొలేషన్ లోకి వెళ్లాలని సూచించారు. 
 
మరోవైపు, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి ఇరు తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. కేంద్ర మంత్రికి కరోనా రావడంతో ఈ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది. 
 
మరోవైపు, దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 69,652 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 977 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 28,36,926కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 53,866కి పెరిగింది. ఇక 6,86,395 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 20,96,665 మంది కోలుకున్నారు.
 
కాగా, బుధవారం వరకు మొత్తం 3,26,61,252 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. బుధవారం ఒక్కరోజులోనే 9,18,470 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు