మాజీ సీఎం జయలలిత మృతి కేసు.. వారం రోజులు వాయిదా

శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (10:59 IST)
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసుపై విచారణను వారం రోజులు వాయిదా వేస్తూ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2016 డిసెంబరు 5న జయలలిత మృతి చెందారు. ఆమె మృతిపై పలు అనుమానాలను వ్యక్తమయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో... జయలలిత మృతిపై విచారణ చేపట్టేందుకు మాజీ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఓ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. విచారణ పూర్తికాకపోవడంతో కమిషన్‌ను ప్రభుత్వం చాలాసార్లు పొడిగించింది. 
 
జయలలితకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి తరపున సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కేసు జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ విచారణకు అడ్డంకిగా మారిందనే విమర్శలున్నాయి. అపోలో ఆసుపత్రి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. 
 
జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ తరపున హాజరైన న్యాయవాదులు, కేసుకు సంబంధించి నలుగురు సాక్షులను విచారించాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. దీంతో తదుపరి విచారణను సుప్రీం కోర్టు వారం రోజులు వాయిదా వేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు