సినీ నటి జయప్రదను తక్షణం అరెస్టు చేయండి..

ఠాగూర్

మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (09:34 IST)
ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు మరో షాక్ తగిలిగింది. ఆమె ఇప్పటికే ఈఎస్​ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన విషయం తెల్సిందే. తాజాగా మరో కేసులో నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ అయ్యింది. 2019 లోక్​సభ ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించినందుకుగానూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలంటూ రాంపుర్​ జిల్లా ఎస్పీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, 2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ తరపున రాంపుర్​ నుంచి ఎంపీగా జయప్రద పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదైవున్నాయి. 
 
అయితే, ఈ కేసుల విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో సాగుతుంది. ఈ విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది కోర్టు. అంతకుముందు కూడా నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ చేసి, ఆమెను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్టు చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టులు హాజరుపరచాలంటూ రాంపూర్ ఎస్పీని ఆదేశిస్తూ, ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. 
 
కాగా, సినిమా తర్వాత తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జయప్రద.. టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీ కూడా అయ్యారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రలోని సమాజ్ వాదీ పార్టీలో చేరి, రాంపుర్​ లోక్​సభ ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు ఆమె రాంపుర్​ ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరి, రాంపుర్​ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు