నిండు భారంతో తన ఆప్త మిత్రుడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ కడసారి నివాళులు అర్పించారు. నిజానికి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అయితే, పార్టీలో కురువృద్ధుడుగా పేరుగాంచన మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం నివాసానికి వచ్చారు. మన్మోహన్ సింగ్ పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట తనయుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.
మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులర్పించారు. శుక్రవారం ఢిల్లీకి చేరుకున్న ఆయన నేరుగా మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. మన్మోహన్ పార్థివదేహం వద్ద అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేవంత్ రెడ్డి శుక్రవారమే హైదరాబాద్ తిరుగు ప్రయాణం కానున్నారు.
మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహానికి రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఢిల్లీ సీఎం అతిశీ, మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాళులు అర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించారు.