కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కఠిన చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా, సినిమా హాళ్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతానికి మించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 7న నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.
సినిమాళ్లలో సీటింగ్ సామర్థ్యం 50 శాతం తగ్గిస్తామని గత శుక్రవారం ప్రభుత్వం ప్రకటించింది. సీటింగ్ సామర్థ్యాన్ని కుదించొద్దని కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి, కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి సీఎం యడ్యూరప్పకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. అయినా ప్రభుత్వం వాటిని పక్కన పెట్టి సగం సీటింగ్ కేపాజిటీతో నడపాలని ఆదేశించింది.
పలు జిల్లాల పరిధిలో పబ్బులు, రెస్టారెంట్లలో 50శాతానికి మించి వినియోగదారులు మించొద్దని ఆదేశించడంతో పాటు పలు ఆంక్షలు విధించింది. ఇదిలా ఉండగా.. శనివారం కర్ణాటకలో 4373 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవగా, 19 మంది మృతి చెందారు. ఇందులో మూడువేలకుపైగా కేసులు బెంగళూరు అర్బన్ ప్రాంతం నుంచే ఉన్నాయి.