జమ్మూ కాశ్మీర్‌లో అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. యాత్రికులను కూడ తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే అవకాశం ఉందని ఐబీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది. ఆదివారం మధ్యాహ్నం 12 :30 గంటలకు అమిత్ షాతో అజిత్ ధోవల్, ఇంటలిజెన్స్ చీఫ్ అరవింద్ కుమార్, రా చీఫ్ సుమంత్ గోయల్ సమావేశమయ్యారు.
కాశ్మీర్ అంశంపైనే ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ యేడాది ఫిబ్రవరిలో పుల్వామాలో జరిపినట్టుగానే పలు దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో భారీ బలగాలను జమ్మూ కాశ్మీర్‌లో మోహరించినట్టుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా ప్రకటించారు.