కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఆరోగ్య మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లాడి కృష్ణారావు తన శాసన సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన రాజీనామాతో పుదుచ్చేరి ప్రభుత్వం ప్రమాదంలో పడింది.
గతంలో మంత్రి నమశిశ్వాయం, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే తెపైంతన్ రాజీనామాలు చేయగా, మరో సభ్యుడు ధన వేలు మీద అనర్హత వేటు పడింది. ఇప్పుడు కృష్ణారావు రాజీనామాతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. ప్రస్తుత ప్రభుత్వానికి 15 మంది (కాంగ్రెస్ 11, డీఎంకే 3, స్వతంత్రులు ఒకరు) ఎమ్మెల్యేల బలం ఉంది.
ప్రతిపక్షాల బలం 14 (ఎన్‌ఆర్ కాంగ్రెస్ 7, ఏఐఏడీఎంకే 4, నామినేటెడ్ 3) ఉంది. ప్రభుత్వ బలంతో సమంగా బీజేపీ కూడా ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది. ఒక స్వతంత్రుడిని గనుక ప్రతిపక్షాలు లాగేసుకుంటే ప్రభుత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.