మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీమూచ్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ ప్రాంతానికి చెందిన కన్హయ్య లాల్ భీల్ (45) అనే ఆగివాసీ తెగకు చెందిన వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు. అదేసమయంలో చిత్తర్మల్ గుర్జర్ అనే పాల వ్యాపారి బైకుపై వచ్చి లాల్ భీల్‌ను ఢీకొట్టాడు. దీంతో బైకుతో పాటు.. ఇద్దరూ కిందపడిపోయారు.
బైకులో ఉన్న పాల క్యాను కూడా కిందపడిపోవడంతో అందులోని పాలు కూడా మొత్తం ఒలిగిపోయాయి. దీంతో కన్హయ్యపై చిత్తర్మల్ దాడికి దిగాడు. తన స్నేహితులను పిలిపించి కొట్టించాడు. ఆ తర్వాత బాధితుడి కాలిని తాడుతో ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లారు. ఒక నిందితుడు అతడి మొహంపై తన్నాడు. బాధతో విలవిల్లాడుతూ అతడు వేడుకున్నా వినలేదు. ఒళ్లంతా రోడ్డుకి రాసుకుపోయి కన్హయ్యకు తీవ్రగాయాలయ్యాయి.
అయితే, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడుని ఆస్పత్రికి తరిలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ ఆయన కనుమూశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. నిందితులందరిపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.