ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తొమ్మిది మంది విపక్ష నేతలు కలిసి ఒక లేఖను రాశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను మద్యం స్కామ్‍లో అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ వారు ఈ లేఖ రాశారు. మనీశ్ సిసోడియాపై చర్యతో మన ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వంలోకి పయనిస్తున్నామా అంటూ ఆ లేఖలో వారు ఘాటుగా పేర్కొన్నారు. ఈ లేఖలో సంతకం చేసిన వారిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పంజాబ్ సీఎం మన్ సింగ్, ఎన్సీపీనేత శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, జేకేఎన్‌సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లు ఉన్నారు.
మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకుండా 2023 ఫిబ్రవరి 23వ తేదీన సీబీఐ అరెస్టు చేసింది. సిసోడియాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. రాజకీయ కుట్ర అంటూ ధ్వజమెత్తాయి. ఆయన అరెస్టుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఢిల్లీలో పాఠశాల విద్యను మార్చడంతో మనీశ్ సిసోడియా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.
2014 నుంచి దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ పాలకుల ఒత్తిడితో విపక్ష నేతలను టార్గెట్ చేయడం ప్రారంభించాయని వారు ప్రధాని మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిండం సరికాదన్నారు. ఈ దాడులకు భయపడిన విపక్ష నేతలు బీజేపీలో చేరగానే ఆ కేసులను నీరు గార్చడం జరుగుతుందని వారు ఆరోపించారు. ఇందుకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్సా శర్మను ఉదారణగా పేర్కొన్నాయి. దాడులతో భయపెట్టి ప్రత్యర్థి పార్టీల నుంచి నేతలను పార్టీలోకి చేర్చుకోవడం, తర్వాతవారికి క్లీన్ చిట్ ఇస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.