ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన మాయావతి.. ఎందుకో తెలుసా?

సోమవారం, 30 డిశెంబరు 2019 (07:27 IST)
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో సీఏఏకు మద్దతు ప్రకటించిన సొంత పార్టీ ఎమ్మెల్యే రమాభాయ్ పరిహార్‌పై బీఎస్‌పీ అధినేత్రి మాయావతి సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయాన్ని మాయావతి ఆదివారం ఓ ట్వీట్‌లో తెలిపారు.

'బీఎస్‌పీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఆ క్రమశిక్షణను ఉల్లంఘించే ఎంపీలు, ఎమ్మెల్యేలపై తక్షణ చర్యలు తీసుకుంటాం. ఫథెరియా ఎమ్మెల్యే రమాభాయ్ పరిహార్ సీఏఏకు మద్దతు ప్రకటించారు. దాంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకాకుండా బ్యాన్ విధించాం' అని మాయావతి ఆ ట్వీట్‌లో తెలిపారు.

పౌరసత్వ సవరణ చట్టం విభజనలను సృష్టిస్తుందని, రాజ్యాంగ నియమనిబంధనలకు వ్యతిరేకమని బీజేపీ మొదటి నుంచి చెబుతూనే ఉందని, పార్లమెంటులో కూడా సీఏఏకు వ్యతిరేకంగా తమ పార్టీ ఓటు వేసిందని మరో ట్వీట్‌లో మాయావతి తెలిపారు.

సీఏఏను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరిన వారిలో బీఎస్‌పీ కూడా ఉందన్నారు. ఇంత జరిగినా సీఏఏకు రమాభాయ్ పరిహార్ మద్దతు ప్రకటించడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు