24 గంటల్లో 23 వేలకు పైగా కరోనా కేసులు

శనివారం, 13 మార్చి 2021 (10:41 IST)
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 23,285 కొత్త కేసులు వెలుగుచూశాయి. 2021లో 23వేల పైన కేసులు ఒకేరోజు నమోదవడం ఇదే మొదటిసారి. శుక్రవారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,13,08,846కు, మరణాల సంఖ్య 1,58,306కి చేరుకుంది.

గత 24 గంటల్లో 117 మంది మరణించారు. గత కొద్ది రోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆరో రోజుల వ్యవధిలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులు పెరుగుతుండటం, కోలుకునేవారు సంఖ్య తగ్గుతుండటం మరింత కలవరపెడుతోంది.

24 గంటల్లో 15,157 మంది కోలుకోగా ఇప్పటివరకు మొత్తం 1,09,53,303 మంది కోలుకున్నారు. రికవరీ రేటు ప్రస్తుతం 96.86శాతానికి పడిపోయింది. కోలుకున్న వారి సంఖ్య తగ్గుతుండంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య మళ్లీ రెండు లక్షలకు చేరువైంది. శుక్రవారం ఉదయానికి దేశవ్యాప్తంగా 1,97,237 యాక్టివ్‌ కేసులున్నాయి. క్రియాశీల రేటు 1.74 శాతంగా ఉంది.

మహారాష్ట్రలో కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో 15,817 కొత్త కేసులు నమోదయ్యాయి. 56 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఏడాదిలో ఇదే అత్యధికం. గత 3 నెలలు నుంచి ఇక్కడ ప్రతీరోజూ 6 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 22,66,374కు చేరుకుంది. దేశంలో 1.9 లక్షల క్రియాశీల కేసులుండగా వీటిల్లో లక్షకు పైగా మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. పంజాబ్‌లోనూ కరోనా విజృంభణ అధికంగా ఉండటంతో మొహాలీ, ఫతేఘర్‌ సాహిబ్‌ జిల్లాల్లో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్వ్ఫూ అమలు చేయనున్నారు.

పంజాబ్‌లో ఇప్పటికే జలంధర్‌, నవాంషహ్ర, హోషియార్‌పూర్‌, కపుర్తల, లూధియానా, పాటియాల జిల్లాల్లో రాత్రి కర్వ్ఫూ అమలు చేస్తున్నారు.
 
టీకాతో వైరస్‌ లాక్‌డౌన్‌ : యుఎన్‌ఒ సెక్రటరీ జనరల్‌ గుటెరస్‌
ప్రపంచంలో ప్రజలందరికీ టీకాకు ఐరాస ప్రధాన కార్యదర్శి అంటోనియా గుటెరెస్‌ భరోసా ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణకు ఇది అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. సమాజాలను లాక్‌డౌన్‌ చేయడం నుంచి వైరస్‌ను లాక్‌డౌన్‌ చేయడానికి టీకా వేయడం సహాయపడుతుందని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు