ఏదైనా కేసులో ఒకే శిక్ష పడిన వారందరికీ ఒకేసారి అమలు చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా నిర్భయ దోషుల ఉరి అమలు వాయిదా పడుతూ వస్తోందని, అందువల్ల ఈ నిబంధనను తొలగించి, నిర్భయ కేసులో దోషులను వేర్వేరుగా ఉరితీసేందుకు అనుమతి ఇవ్వాలంటూ తాజా పిటీషన్‌లో కోరింది.
నిజానికి నిర్భయ కేసులో ఉరిశిక్షలు పడిన నలుగురు ముద్దాయిలు.. ఈ శిక్షల నుంచి తప్పించుకునేందుకు తమకు అందుబాటులో ఉన్న న్యాయ మార్గాలన్నింటిని ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా, దోషులు ఒకరొకరుగా కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు వేస్తూ పోవడం, తర్వాత ఒకరొకరుగా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం, సుప్రీం ఆదేశాలపై రివ్యూ పిటిషన్లు వేయడం వంటివి చేస్తూ.. ఉరిశిక్ష అమలుకాకుండా చూస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వారికి వేర్వేరుగా శిక్ష అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మరోవైపు, దోషుల తీరు వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని కోర్టుకు విన్నవించింది. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత విచారణ జరుపుతామని కోర్టు ప్రకటించింది. ఇక పవన్ గుప్తా విషయంగా త్వరగా తేల్చేందుకు సీనియర్ అడ్వొకేట్ అంజనా ప్రకాశ్‌ను అమికస్ క్యూరీ (కోర్టు సహాయకులు)గా నియమించింది.