ప్రధాని మోడీ సర్కారుపై అవిశ్వాసం.. వాడివేడిగా చర్చ

మంగళవారం, 8 ఆగస్టు 2023 (13:53 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విపక్షాలు చేపట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్‌లో వాడివేడి చర్చ సాగుతోంది. మణిపూర్  అంశంపై పార్లమెంట్‌లో మాట్లాడకుండా ఉండేందుకు ప్రధాని మోడీ మౌనవత్రం పట్టారని, ఆయన్ను మాట్లాడించేందుకే తాము అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ అన్నారు. 
 
కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి 'ఇండియ' ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ ప్రారంభమైంది. దీనిలో భాగంగా ఆయన ఈ మాట అన్నారు. అలాగే మూడు ప్రశ్నలను సంధించారు. 
 
1. ఇప్పటివరకు ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మణిపుర్‌లో పర్యటించలేదు. 
 
2. మణిపుర్‌పై మాట్లాడేందుకు 80 రోజుల సమయం ఎందుకు పట్టింది..? అప్పుడు కూడా కేవలం 30 సెకన్లు మాత్రమే మాట్లాడతారా..?
 
3. ఎందుకు ఇప్పటివరకు మణిపుర్ సీఎంను తొలగించలేదు..? అంటూ ప్రశ్నించారు. 
 
ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌‌లో రెండు జాతుల మధ్య వైరం జరుగుతోంది. దానిపై ప్రకటన చేసేందుకు మోడీ పార్లమెంట్‌కు రావాలని గత కొద్దిరోజులుగా విపక్షాలు పట్టుబడుతున్నాయి. దాంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. దీనిపై హోం మంత్రి అమిత్‌ షా బదులిస్తారని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ కీలక అంశంపై ప్రధానే స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే విపక్షాలు అవిశ్వాస అస్త్రాన్ని ఉపయోగించాయి. 
 
ఈ చర్చలో భాగంగా గొగొయ్ మాట్లాడుతూ.. ‘మేం అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చేలా పరిస్థితులు ఎదురయ్యాయి. ఇది లోక్‌సభలో ఉన్న సంఖ్యాబలం గురించి తెలుసుకోవడానికి తెచ్చింది కాదు. మేం ఈ తీర్మానం నెగ్గుతామన్న నమ్మకం కూడా లేదు. కానీ, మణిపుర్‌కు న్యాయం జరగాలనే ఉద్దేశంతో తీసుకువచ్చింది’ అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు