ఉద్యోగం మారారా? పీఎఫ్ సొమ్ముపై టెన్షన్ పడుతున్నారా? ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్ అమలు!!

ఠాగూర్

సోమవారం, 1 ఏప్రియల్ 2024 (11:50 IST)
చాలా మంది ఉద్యోగులు ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారుతుంటారు. ఇలాంటి వారు తమ పీఎఫ్ ఖాతాలోని డబ్బుల గురించి ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి వారికి ఈపీఎఫ్‌వో శుభవార్త చెప్పింది. ఉద్యోగం మారినా పీఎఫ్ గురించి టెన్షన్ అక్కర్లేదని తెలిపింది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం... ఒక ఉద్యోగి ఒక కంపెనీకి రాజీనామా చేసి మరో కంపెనీ ఉద్యోగంలో చేరినా అతని పీఎఫ్ సొమ్ము ఆటోమేటిక్‌ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయ్యేలా కొత్త నియమాన్ని తీసుకొచ్చింది. పాత ఖాతాలోని సొమ్ము మొత్తం కొత్త ఖాతాలోకి బదిలీ అవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకునే పనిలేకుండా మార్పులు ప్రభుత్వం చేసింది. 
 
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగం మారిన సందర్భంలో సదరు ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లు కూడా ఆటోమేటిక్‌గా విలీనం అవుతాయి. పాత ఖాతాలో ఉన్న నిధులు కొత్త ఖాతాలోకి బదిలీ అవుతాయి. దీంతో పీఎఫ్ ఖాతాలో సీనియారిటీ విషయంలోనూ టెన్షన్ పడాల్సిన అవసరం ఉద్యోగికి ఉండదు. సాధారణంగా పీఎఫ్ ఖాతాలో నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకున్నపుడు కొంత మొత్తం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల సర్వీసు దాటిన ఖాతాల నుంచి సొమ్ము తీసుకున్నపుడు అయితే ఈ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. తాజాగా అమల్లోకి వచ్చిన రూల్‌తో ఉద్యోగం మారినా పీఎఫ్ ఖాతా సీనియారిటీ విషయంలో మార్పుండదు. కాబట్టి ఈ పన్ను మినహాయింపు ప్రయోజనం పొందే అవకాశం కలుగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు