మీకు.. మీ పదవికో నమస్కారం : శశికళతో మాజీ సీఎం పన్నీర్ సెల్వం

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (10:26 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం తీవ్ర మనస్థాపం చెందారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కోరారు. ఆమరుక్షణమే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మనస్థాపం చెందిన పన్నీర్ సెల్వం... ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్టు ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు. 
 
ఈ విషయం తెలుసుకున్న శశికళ.. పన్నీర్‌ను పోయెస్ గార్డెన్‌కు పిలిచి బుజ్జగించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు.. కీలకమైన ఆర్థిక, ప్రజాపనుల శాఖలను కట్టబెడతామని చెప్పారు. అయినప్పటికీ పన్నీర్ శాంతించలేదు.
 
మీరూ వద్దూ.. మీ పదవులు వద్దంటూ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. పైగా, శశికళ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంలో ఎలాంటి పదవిలోనూ కొనసాగకుండా సాధారణ కార్యకర్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు. శశికళ ఏ పదవి ఇచ్చినా తీసుకునే ప్రసక్తేలేదని కరాఖండిగా తేల్చి చెప్పారు. 
 
అదేసమయంలో ప్రమాణస్వీకారం చెయ్యడానికి ఏర్పాట్లు చేసుకున్న శశికళకు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఝులక్ ఇచ్చారు. శశికళపై ఉన్న అక్రమాస్తుల కేసులో తీర్పును వచ్చే వారంలో సుప్రీంకోర్టు ఇవ్వనుంది. దీంతో గవర్నర్ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నట్టు సమాచారం. అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు శశికళ ప్రమాణ స్వీకారం లేనట్టేనని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి